STRUGGLES..! I have came across in my married life & later on..

Categories BlogPosted on
Nee jivitham
పంతొమ్మిది.. పెళ్లి అనే నవల పుస్తకాల్లో చదివిందే కానీ.. నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి కూడా ప్రవేశిస్తుందని ఊహించలేదు.
ఏమి తెలియని వయసులో పుట్టినిల్లు వదిలి మెట్టినింటికి వెళ్ళిపోయా..
ఏ లోటూ లేకుండా చూసుకునే అత్త..మామ.. కొత్తగా పెళ్లి కావడంతో ఇంట్లో నాతోనే ఉండే మా ఆయన.. కోట్లకు వారసుడు..
నాకు చిన్నప్పటి నుంచి చదువంటే పిచ్చి.. అలానే పెరిగాను.. అనుకోకుండా ఒకరు నన్ను చూసి నేను నచ్చి వారింట్లో ఉంటే లక్ష్మీ దేవిలా ఉంటానని సంబంధం మాట్లాడారు.. రెప్పపాటులో అన్ని జరిగిపోయాయి..
పెళ్లి తరువాత కూడా.. నా చదువుని నేను కొనసాగించాను..
మా ఆయన ఇంట్లో నుండి బయటకి కూడా రావటానికి ఇష్టపడే వారు కాదు..
పుస్తకం అంటే నాకు పిచ్చి.. పుస్తకం పేరు వింటేనే మా ఆయనకు పిచ్చి..
అలా ఏది మాట్లాడకుండా నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను.. ఉన్నత విద్యలు చదవాలని నా కోరిక.. కానీ కొంత కాలం ఉద్యోగం చెయ్యాలని అనుకున్నా..
ఈ మూడు సంవత్సరాల్లో మా ఆయనకి నేను ప్రేమగా ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాను అనే విషయం నన్ను వెంటాడింది..
కనీసం చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకునే వారు కాదు.. అయినా సర్దుకొని నవ్వుతూనే ఉన్నాను..
పదిమందిలో తనని ఎటైనా తీసుకువెళ్లాలని అనుకుంటే భయంగా ఉండేది..
ఎలాగో ప్రేమ లేదు.. పిల్లలు లేరు..
ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నా.. వెళ్ళిపోయా..

 

కొత్త దేశం.. కొత్త జీవితం.. 

 

చదువుకుంటూ.. అప్పుడపుడు మా ఆయనతో మాట్లాడుతూ.. రోజులు గడుస్తున్నాయి..
దేశం మారినా.. దూరం పెరిగినా.. ఆయనలో ఎక్కడ మార్పు లేదు.. ప్రేమ కనిపించలేదు..
కాలేజీలో కొత్త పరిచయాలు..
ఒక అబ్బాయికి నాకు పరిచయం ఏర్పడింది.. పరిచయం ప్రేమగా మారింది.. ప్రేమ ప్రయాణంలో మా మధ్య ఏ హద్దులు లేకుండా చాలా ఆనందంగా సాగింది.. నాకు పెళ్లి అయ్యిందని తనకి , తనకి పెళ్లి అయ్యిందని నాకు తెలిసే ఈ అనుభందం ఏర్పడింది..
క్రమక్రమంగా మా ఆయనతో మాటలు మూగబోయాయి..
నేను ఇంటికి వెళుతున్నా అని తెలిసి నాకోసం ఆ అబ్బాయి నాతో వచ్చేశాడు..
మళ్లీ ఇంటికి వెళ్ళినా అదే తీరు.. ఇక నా వల్ల కాలేదు.. విడాకులు కావాలని చెప్పా.. అప్పటికే నేను గర్భవతిని..
బాబు పుట్టగానే మేము విడిపోయాం..
విదేశాల్లో నాతో ఉన్న వ్యక్తి తన ఇంట్లో పిల్లల కోసం నాతో ఉండలేనని చెప్పారు.. అదేవిధంగా నేను లేకుండా ఉండలేను అని చెప్పారు..
అలాంటి ఒక బంధంలో నేను ఉండలేను.. నా మనసు ఒప్పుకోలేదు..
తాళి కట్టినవాడితో కలిసి ఉండలేకపోయాను..
తల్లిని చేసిన వాడు కలిసి ఉండలేను అన్నాడు..
మొదట తప్పు చేసిన నా తల్లితండ్రులను నిందించాలా ?
ఒక తప్పు వల్ల ఇన్ని తప్పులు చేసిన నన్ను నేను నిందించుకోవాలా??
నాకు నేనే సరిగ్గా తెలియని వయస్సులో.. నన్ను నేనే అర్థం చేసుకోలేని తరుణంలో.. పెళ్లి అనే ఒక తెలియని బంధం వల్ల ఈరోజు వరకు మదన పడే నా మనసుకి ఏమని సమాధానం చెప్పుకోవాలి ??
ఆస్తులు చూసి అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ అమ్మాయిని అసమర్ధుడికి ఇచ్చి అప్పగింతలు చేసి పంపే ప్రతి తల్లితండ్రులు ఆలోచించాలని ఈ అనుభవాన్ని తెలియజేస్తున్నాను..