A heartfelt reaction based on continuous happening issues of SUICIDE

Categories BlogPosted on
SUICIDE

పుట్టుక.. చావు.. ఈ రెండింటి మధ్య చేసే పోరాటమే జీవితం. పోరాడటం చేతకాని వాళ్లు చేసే పిరికి చర్యకే ఆత్మహత్య అని నామకరణం కూడా చేసారు. అసలు ఎందుకలా చేశారా అని ఆలోచిస్తూ ఉన్నా.. ఆత్మని హత్య చేయడమేంటి అని నాలో నాకే ఒక ప్రశ్న !! చివరికి ఒక కొలిక్కి వచ్చా..

సాధారణంగా మరణిస్తే వేరు.. అదే ఆత్మహత్య అంటే.. మనస్సు చంపుకొని బతలేక తనను తానే ఈ సమాజం నుండి వెలివేసుకోడం.. అది ఏ పరంగా అయినా కావచ్చు. ఈ మధ్య పరీక్ష తప్పినా.. ప్రేమలో విఫలమైనా.. తల్లిదండ్రులు తిట్టినా.. అప్పుల బాధలో మునిగిపోయినా.. కారణం ఏదైనా ఎందుకైనా.. ఆటలో నుంచి తప్పుకునంత సులువుగా జీవితం నుంచి తప్పించుకుంటున్నారు.

ఇలా చేస్తున్న వారిని చూసి చూసి విసిగిన సహజీవిగా నాలో మెదిలిన మాటలు..

ఏ అదృష్టమో, కోట్ల కణాల్లో ఒకడిరిలా బయట పడ్డావు..

ఏ అదృష్టమో, శరీరంలో అన్ని సవ్యంగా ఉన్న జీవిలా సంచరిస్తున్నావు..

ఏ అదృష్టమో, తల్లిదండ్రుల ప్రేమను పొందావు..

ఏ అదృష్టమో, నీకోసం నిలిచే నలుగురిని సంపాదించుకున్నావు..

మరి ఏమైందని.. ఎందుకని..

ఏ రోగమో, మార్కులు రాకపోతే నిన్ను మందలిస్తారని లోకం వీడమనింది..

ఏ రోగమో, అమ్మాయి / అబ్బాయి మోసం చేస్తే పాఠం నేర్చుకోకుండా పట్టాలెక్కమనింది..

ఏ రోగమో, కని.. పెంచిన తల్లిదండ్రులు ఒక మాట తిట్టినా సహించలేక సావమంది..

ఏ రోగమో, లేని ఆర్భాటాలకు వెళ్లి అప్పులు చేసి అర్థాంతరంగా నీ జీవితాన్ని ముగించమంది..

చచ్చే ధైర్యం ఉన్నప్పుడు.. జీవితాన్ని చేదించేంత విషయం కూడా ఉంటుంది.. క్షణాల్లో తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకోకపోతే ఎలా ? మీరు మోసపోయారని.. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లని మోసం చేస్తారా? మీరు ఓడిపోయారని మీ గెలుపు కోసం ఎదురుచూసే కళ్లను గుడ్డివి చేస్తారా ? నచ్చని జీవితాన్ని నచ్చేలా మార్చుకోవాలే కానీ లేని నరకానికి దారి వెతుకుంటే ఎలా ?

ఆలోచించడానికి అరక్షణం పట్టదు..

ఆచరించడానికి క్షణం పట్టదు.. కానీ

ఆ ఆలోచన , ఆచరణ.. నీ జీవితాన్ని ముందుకి నడపాలే కానీ నీతో పాటు నీకోసం బతికే వారి జీవితాలను కూడా అక్కడితో ఆగేలా చెయ్యకూడదు..

ఇది కేవలం నా మదిలో రగిలిన ఆవేదన.. ఎందరో ఆత్మహత్యలను చూస్తూ మూగబోయిన మనసు నుంచి బయటపడిన బాధ.. అన్నింటికీ చావే దారి అయితే ఇక ఈ జీవితమెందుకు.. ఇప్పటివరకు జరిగిన వాటికి చింతిస్తూ.. ఇప్పటికైనా ఆలోచిస్తారనే ఆశతో.. ముగిస్తున్నా..